ల‌వ్‌స్టోరి మూవీ రివ్యూః ప్రాణం లాగేస్త‌ద‌బ్బా..!

కొన్ని సినిమాలు చూస్తున్నంత సేపు బావుంటే, మ‌రికొన్ని సినిమాలు చూశాక కూడా బాగా అనిపిస్తాయి. ఇంకొన్ని సినిమాలు కొంత‌కాలం పాటు గుర్తుండిపోవ‌డంతో పాటుగా, మ‌నల్ని వెంటాడుతూంటాయి. నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌విల 'ల‌వ్‌స్టోరి' కూడా ఆ కోవ‌లోకే వ‌స్తుంది. కాలాలు, క‌ట్టుబాట్లు, గెలుపోట‌ములు ఆవలి తీరంలో.. ఎప్ప‌టికీ నిలిచేది, గెలిచేది ప్రేమ మాత్ర‌మే అంటూ చాలా సెన్సిబుల్ గా శేఖ‌ర్ క‌మ్ముల చేసిన ప్ర‌య‌త్న‌మే ల‌వ్‌స్టోరి. క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత అంద‌రూ మంచి సినిమా అవుతుంద‌ని హోప్స్ పెట్టుకున్న ల‌వ్‌స్టోరి ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను ఏ మేర‌కు అందుకుందో చూద్దాం. జుంబా డ్యాన్స్ సెంట‌ర్ న‌డిపే నాగ‌చైత‌న్య‌కు బీటెక్ చ‌దివి ఉద్యోగం కోసం క‌ష్ట‌ప‌డుతున్న మౌనిక ప‌రిచ‌య‌మ‌వుతుంది. ఆ ప‌రిచ‌యంలో మెల్లిగా ప్రేమ చిగురించ‌డం, ఆ ప్రేమ‌ను పెళ్లివ‌ర‌కు తీసుకెళ్లాల‌నుకున్న‌ప్పుడు మ‌ధ్య‌లో కులం అనే అడ్డంకి రావ‌డం.. ఈ క‌థంతా రొటీన్‌గానే అనిపించిన‌ప్ప‌టికీ, శేఖ‌ర్ క‌మ్ముల దాన్ని తెర మీద ప్రెజెంట్ చేసిన విధానం ఒక విజువ‌ల్ వండ‌ర్ లా అనిపిస్తుంది. తెలంగాణ ప్రాంత బ్యాక్ డ్రాప్ లో ప్రేమ క‌థ‌తో పాటుగా, కులాంత‌ర వ్య‌వ‌స్థ‌ను, మ‌రో సెన్సిటివ్ అంశాన్ని కూడా ట‌చ్ చేయాలనుకున్న శేఖ‌ర్ క‌మ్ముల ఆ స్టోరీని తెర‌మీదకు తీసుకురావాల‌నుకున్నారు. కాస్ట్ టాపిక్ ను క‌దిలించినా అది మ‌రీ ఎక్కువ‌గా కాకుండా, త‌ను చెప్పాల‌నుకున్న‌ది క‌రెక్ట్ గా ఆడియ‌న్స్ కు త‌గిలేటట్టు సింపుల్ గా చెప్పారు.దాని కోసం ఆయ‌న రాసుకున్న సంభాష‌ణ‌లు ఆలోచించేవిగా ఉంటాయి. ఏది ఎక్క‌డ వ‌ర‌కు చెప్పొచ్చో, ఎలా చెప్పొచ్చో శేఖ‌ర్ కు బాగా తెలుసు. హీరోతో అంత‌గా మాట్లాడే అమ్మాయి, ఎందుకు అత‌న్ని ఎప్పుడూ దూరంగా ఉంచుతుంది? కుల‌మే కార‌ణ‌మా అనుకునేలా చేసి, లాస్ట్ లో అస‌లు కార‌ణం చెప్ప‌డం, పెళ్లి కోసం హీరో తల్లి పెట్టే కండిష‌న్, క్లైమాక్స్ లో హీరోయిన్ కాలి చెప్పు తీసి వార్నింగ్ ఇవ‌న్నీ శేఖ‌ర్ సెన్సిబుల్ గా చెప్ప‌డం డైర‌క్ట‌ర్ స్పెషాలిటీ. అక్క‌డ హీరోయిన్ చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చేది త‌న నాన‌మ్మ‌కు మాత్ర‌మే కాదు, బుర్ర‌లో త‌ప్పుడు ఆలోచ‌న‌లు పెట్టుకున్న ప్ర‌తిఒక్క‌రికీ. ఇలా కొన్ని సీన్ల‌లో శేఖ‌ర్ క‌మ్ముల మార్క్ క‌నిపిస్తుంది.కాక‌పోతే క్లైమాక్స్ ను ఏదో టైమ్ అయిపోతుంది త్వ‌ర‌గా ముగించాలి అనుకుని ముగించిన‌ట్ల‌నిపిస్తుంది. ఇక‌ త‌ను రాసుకున్న క‌థను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి శేఖ‌ర్ మంచి న‌టీన‌టుల‌నే ఎంచుకున్నాడు. ఎంత‌లా అంటే మెయిన్ లీడ్ ఇద్ద‌రూ ఇంకాసేపు తెర‌పై క‌నిపిస్తూంటే చాలు అనిపించేంత‌లా ఉండే లీడ్ పెయిర్ ను సెలెక్ట్ చేసుకోవ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట్ అయింది. సినిమాలో రేవంత్, మౌనిక లు త‌ప్ప ఎక్క‌డా నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌విలు చూద్దామ‌న్నా క‌నిపించ‌రు. అంత‌గా వారి పాత్ర‌ల్లో ప‌రకాయ ప్ర‌వేశం చేశారు. క‌థ మొత్తాన్ని ఆసాంతం త‌న భుజాల‌పై వేసుకుని న‌డిపించింది సాయి ప‌ల్ల‌వి. ప్ర‌తీ సన్నివేశంలోనూ ఇంత‌కంటే బాగా ఎవ‌రూ చేయ‌లేరు అనేంత న‌ట‌న‌ను క‌న‌బ‌రిచింది. ఇక డ్యాన్సులైతే నిజంగా ట్రైల‌ర్ లో చెప్పిన‌ట్లు వ‌ర్షంలో నెమ‌లి నాట్యం చేస్తున్న‌ట్లే అనిపిస్తుంది. ఒక మంచి డైర‌క్ట‌ర్ కు స‌రైన న‌టి దొరికితే ఎలా ఉంటుందో మ‌రోసారి సాయి ప‌ల్ల‌వి నిరూపించింది. రేవంత్ గా నాగ చైత‌న్య జీవించాడు. న‌టుడిగా నాగ‌చైత‌న్య మ‌రో మెట్టు ఎక్కాడు. జుంబా డ్యాన్సర్ గా ఎంతో ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ ఇస్తూనే, సీరియ‌స్ స‌న్నివేశాల్లో మెచ్చూర్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. చైత‌న్య త‌ల్లి పాత్ర‌లో ఈశ్వ‌రి రావు, మౌనిక త‌ల్లిగా దేవ‌యాని మెప్పించారు. రాజీవ్ క‌న‌కాల కు ఇది భిన్న‌మైన పాత్ర‌నే చెప్పాలి. ఆ పాత్ర‌లో త‌ను న్యాయం చేశాడు. ఉత్తేజ్ క‌నిపించేది నాలుగు సీన్సే అయినా ఉన్నంత‌లో మెప్పిస్తాడు. మిగిలిన వారు తమ త‌మ పాత్ర‌ల ప‌రిధిలో చేశారు. సాంకేతికంగానూ ల‌వ్‌స్టోరి రిచ్ గానే తెర‌కెక్కింది. ప్ర‌తీ విజువ‌ల్ ఒక క‌థ‌లా ఉంటే, ప‌వ‌న్ అందించిన ప్ర‌తీ పాటా ఒక కావ్యంలా ఉంది. విజువ‌ల్ గా కూడా పాట‌లు చాలా బావున్నాయి. త‌ర రంపం, సారంగ ద‌రియా కు మంచి స్టెప్పులు ప‌డ్డాయి. నేప‌థ్య సంగీతం కూడా సినిమాను త‌ర్వాతి స్థాయికి తీసుకెళ్లేలా ఉంది. ఎడిటింగ్ కూడా బాగానే కుదిరింది. మొత్తానికి ఫ‌స్ట్ హాఫ్ ల‌వ్ స‌న్నివేశాల‌తో, సెకండాఫ్ ఎమోష‌న్స్ తో సాగిన ల‌వ్‌స్టోరి ప్రాణం లాగేస్త‌ద‌బ్బా..

Comments

Post a Comment